నోవిసాద్ (సెర్బియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 22 ఏళ్ల సుజీత్ 10–0 పాయింట్ల తేడాతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఉమిద్‌జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల్లో... 4 నిమిషాల 53 సెకన్లు ముగిసిన దశలో సుజీత్ తన ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. దాంతో నిబంధనల ప్రకారం రిఫరీ
బౌట్‌ను నిలిపివేసి సుజీత్‌ను విజేతగా ప్రకటించారు.
అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మూడో భారతీయ రెజ్లర్‌గా సుజీత్ గుర్తింపు పొందాడు. 2022లో అమన్ సెహ్రావత్ (57 కేజీలు), 2024లో చిరాగ్ చికారా (57 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. తాజా ప్రదర్శనతో సుజీత్ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సుజీత్ 2022, 2025లలో ఆసియా అండర్–23 చాంపియన్‌షిప్‌లో, 2022లో ఆసియా అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు.


