
భద్రత కారణంగా పదే పదే అవరోధాలు
భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్ మనోగతం
సాక్షి క్రీడా విభాగం: ఒకవైపు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడి మధ్య ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణం... మరోవైపు పోటీలు జరిగే దేశంలో ఉండే పరిస్థితులు, అనుకూలతల గురించి ఆలోచిస్తూ తమ వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం... సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇలాంటి దశను ఎదుర్కొంటూనే ఉంటారు. టీమ్ గేమ్‌లకు సంబంధించి ఏర్పాట్లను చక్కబెట్టేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి. అదే వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లు మాత్రం అన్నీ తామే చూసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ విషయంలో ఎన్నో ఏర్పాట్లు, మరెన్నో అదనపు జాగ్రత్తలతో వారు పోటీలకు వెళుతుంటారు. కానీ ఇలాంటి ఆటగాళ్లకు విమానాశ్రయంలో ప్రతీసారి నిబంధనల పేరుతో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రశాంతంగా, సమస్య లేకుండా ప్రయాణం చేయాల్సిన అథ్లెట్లు సామాన్యుల తరహాలో అనేక తనిఖీలను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్‌కు ప్రతీసారి ఇలాంటి అనుభవమే ఎదురవుతూ ఉంటుంది.
2022 ఆసియా క్రీడల డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్‌లో శంకర్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో భాగంగా అతను పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దాని కోసమే అతను ఎక్కడికైనా తన సొంత ‘పోల్’లను తీసుకెళతాడు. సుమారు 15.7 అడుగుల పొడవు ఉండే ఈ పోల్‌ను ముందుగా విమానాశ్రయం కార్గోలోకి తీసుకెళ్ళడం మొదలు విమానం దిగిన తర్వాత ఆయా ఎయిర్‌పోర్ట్‌నుంచి బయటకు తీసుకు రావడం వరకు పెద్ద ప్రహసనం సాగుతుంది. భారత్‌లో జరిగే ఈవెంట్లలో అయితే అతను తన పోల్‌లను ట్రైన్‌ల ద్వారా సునాయాసంగా పంపించేస్తాడు.
అదే విదేశాలకు వెళ్లేటప్పుడే సమస్య ఎదురవుతుంది. టోర్నీ జరిగే సమయంలో నిర్వాహకులు పోల్‌లను సిద్ధం చేస్తారు కానీ కొత్తవాటిని ఉపయోగించడంలో చాలా సమస్యలు ఉంటాయి. వాటి పొడవు, బరువును బట్టి ప్రాక్టీస్‌లో వాడటం బాగా అలవాటైన పోల్‌లనే పోటీల్లోనూ వాడితే సౌకర్యంగా ఉంటుంది. అందుకే తేజస్విన్ కూడా ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళతాడు. యూరోప్, అమెరికా దేశాల్లో ఇలాంటి సమస్య తక్కువ. అగ్రశ్రేణి అథ్లెట్లంతా ఈ రెండు ఖండాల్లో తమకు అనువైన చోట ఒక్కో సెట్‌ను ఉంచుతారు. వాటిని తరలించడంలో వారికి పెద్దగా ఇబ్బంది ఎదురు కాదు.
ఈనెల 27 నుంచి దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తేజస్విన్ పాల్గొంటున్నాడు. అతని ఈవెంట్ రెండు రోజులపాటు ఉంటుంది. మే 27న తొలి రోజు ఐదు ఈవెంట్స్ (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు)... రెండో రోజు మే 28న మరో ఐదు ఈవెంట్స్ (110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–3 డెకాథ్లెట్‌లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో తేజస్విన్ తన గతానుభవాలను వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే....
‘నా ఈవెంట్‌కు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌లో జావెలిన్, డిస్కస్, షాట్‌పుట్ సహా అన్నింటిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ చెకింగ్ ద్వారానే నేను దాటించ గలుగుతాను. కానీ అసలు సమస్య పోల్‌వాల్ట్ పోటీల్లో వాడే పోల్ గురించే వస్తుంది. దాదాపు 5 మీటర్ల పొడవు ఉండే పోల్‌ను తీసుకెళ్లడం నాకు ఎప్పుడూ సమస్యే. అన్నింటికంటే ముందు ప్రధాన ద్వారం వద్దే సీఐఎస్‌ఎఫ్ జవాన్లు నన్ను ఆపేస్తారు. నా గురించి మొత్తం చెప్పిన గతంలోనూ ఇలా వెళ్లానని వివరించాల్సి వస్తుంది.
మరోవైపు ప్రయాణీకులేమో నేనేదో ఆయుధాలు తీసుకెళుతున్నట్లు చూస్తారు. సాధారణంగా లగేజీకి వాడే రెండు కార్గో లిఫ్ట్‌లలో ఈ పోల్‌లు పట్టవు. అందుకే మరో లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుంది. మొదటిసారి నేను ఈ పోల్స్ తీసుకొని భారత్‌కు తిరిగొచ్చాక వాటిని ఎలా బయటకు తీసుకురావాలో తెలీక కొందరు అధికారులు వెనక్కి పంపాలని కూడా ఆలోచించారు. చివరకు నాలుగు రోజుల తర్వాత అలాంటి వాటి కోసం స్టీల్ గేట్ ఒకటి ఉంటుందని తెలిసింది. దానిని కేవలం ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడతారని వారు చెప్పారు.
ఈ గేట్‌ను వాడేందుకు నేను ముందుగా సదరు ఎయిర్‌లైన్స్ అధికారుల లెటర్ తీసుకోవాలి. ఆపై సెక్యూరిటీ హెడ్, కస్టమ్స్ హెడ్‌తో కూడా దానిపై సంతకం చేయించాలి. వేర్వేరు చోట్ల బిజీగా ఉండేవారంతా ఒకే సమయంలో మనకు దొరకరు. చివరకు ఆ స్టీల్ గేట్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదు గంటల పాటు సాగుతుంది! అందుకే నేను ప్రయాణ సమయానికన్నా ఎన్నో గంటల ముందు అక్కడుంటాను. కాస్త ఆలస్యం అయితే వారు నన్ను పట్టించుకోరు.
ఎన్నిసార్లు నేను ఇదే చేస్తున్నా ప్రతీసారి మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. భారత్ నుంచి వెళ్లిన తర్వాత మనం ఏ దేశంలో అడుగుపెడుతున్నాం అనేదానిపై తర్వాతి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్‌లు బాగా సహకరిస్తే కొన్ని పోల్స్‌ను తీసుకెళ్లమని గట్టిగా చెప్పేస్తాయి. నాకు ఇదంతా చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే పతకం గెలిచి వస్తున్నప్పుడు ఎంతో చక్కగా మనకు సహాయం చేస్తారు కూడా. ఇది ఒక అథ్లెట్‌గా నాకు కలిగే ఆనందం’ అని తేజస్విన్ వివరించాడు.