– దర్శకుడు బాబీ
‘‘నిజాయితీగా కష్టపడి పని చేస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని అందిస్తాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్‌కి కూడా అలాంటి విజయాన్ని అందించాడు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. వేణు ఊడుగుల దగ్గర ఉన్న కథలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం’’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.
సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్‌కి శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమాతో ఇలా టీమ్ అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. వేణు ఊడుగులని చూస్తుంటే నాకూ ప్రొడ్యూసర్ కావాలని ఉంది. డైరెక్టర్ సాయిలు అమీర్‌పేట (ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే అమీర్ పేట్‌లో అర్ధనగ్నంగా నిలబడతానని సాయిలు పేర్కొన్నారు) సవాల్ చేసినప్పుడు సాటి డైరెక్టర్‌గా భయమేసింది. కానీ తను బాక్సాఫీస్ బద్దలు కొట్టే సక్సెస్ ఇచ్చాడు’’ అని తెలిపారు.
‘‘రాజు వెడ్స్ రాంబాయి’ని నా జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు సాయిలు కంపాటి. ‘‘మా సినిమా ప్రివ్యూ చూసిన కొందరు ఒక్క షో కూడా ఆడదన్నారు. కానీ, ప్రేక్షకులు మా చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వేణు ఊడుగుల చెప్పారు. నిర్మాతలు రాహుల్ మోపిదేవి, వంశీ నందిపాటి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్, నటీనటులు అనితా చౌదరి, శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి తదితరులు మాట్లాడారు.


