న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని (Jawaharlal Nehru Stadium) పూర్తిగా కూల్చేసి పునర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యాధునిక వసతులతో సిద్ధం చేసి దానిని ‘స్పోర్ట్స్ సిటీ’గా మార్చనున్నారు. అన్ని రకాల ప్రధాన క్రీడలకు కేంద్రంగా దీనిని రూపుదిద్దాలనే ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
102 ఎకరాల స్థలం
స్టేడియానికి సంబంధించి ప్రస్తుతం 102 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. పూర్తి ఖర్చు, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహా ఇప్పుడు స్టేడియంలోనే ఉన్న కార్యాలయాలన్నీ మరో చోటుకు తరలించనున్నారు.
ఖతర్, ఆస్ట్రేలియాలలో ఉన్న స్పోర్ట్స్ సిటీ నమూనాలను నెహ్రూ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలిస్తున్నారు. కాగా 1982లో ఆసియా క్రీడల సందర్భంగా నిర్మించిన ఈ స్టేడియాన్ని 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం రూ.900 కోట్లతో ఆధునీకరించారు.
320 మంది అసిస్టెంట్ కోచ్‌ల ఎంపిక...
దేశవ్యాప్తంగా 320 మంది అసిస్టెంట్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. 25 రకాల క్రీడాంశాల్లో వీరిని నియమించేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
‘సాయ్’ కేంద్రాల్లో వీరిని నియమిస్తారు. అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించే లక్ష్యంతో ‘మెడల్ స్ట్రాటజీ’ అంటూ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా ఈ కోచ్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ 320 మందిలో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.
చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు


