
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికా, కరేబియన్ దీవులకు చేరుకున్నాయి.
ఇక టీమిండియా విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు.
ఉగ్ర ముప్పు...
అయితే ఈ దాయాదుల పోరుకు ప్రో ఐసీస్ గ్రూపు నుంచి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మ్యాచ్ జరిగే న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భద్రతను పెంచారు.
అంతేకాకుండా టీమిండియా బస చేస్తున్న హోటల్‌లో కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు యూఎస్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని విధాలగా ప్రయత్నిస్తున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
స్పందించిన ఐసీసీ..
అయితే పాక్-భారత్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు వార్తలపై ఐసీసీ స్పందిచింది. "ఈటోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు భద్రతా పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ ఈవెంట్‌లో ప్రతీ ఒక్కరి భద్రతే ముఖ్యం.
ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ రెండు దేశాల అధికారులతో మేము కలిసి పనిచేస్తున్నాము. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఒకవేళ అనుకోకుండా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే సరిదిద్దేందుకు సిద్దంగా ఉంటామని ఐసీసీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.