
చెన్నై: బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. పంజాబ్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ హోరాహోరీ పోరులో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (127 బంతుల్లో 163; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు.
పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేయగా... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 39.5 ఓవర్లలో 298/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కెప్టెన్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (55 బంతుల్లో 73; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సలీల్ అరోరా (47 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో పంజాబ్ జట్టు వేగంగా పరుగులు సాధించింది.
హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 3 వికెట్లు పడగొట్టగా... తనయ్, నిశాంత్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 292 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 41 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌కు హిమతేజ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించాడు.
చదవండి: ఆసియాకప్ జట్టులో నో ఛాన్స్.. పాకిస్తాన్ కెప్టెన్ కీలక నిర్ణయం