
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. హిమాచల్ ప్రదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 144 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ బాదిన నాలుగు సిక్సర్లు వరుస బంతుల్లో బాదినవి కావడం విశేషం. అమన్ జైన్వాల్ అనే బౌలర్ వేసిన ఓ ఓవర్‌లో రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. రుతురాజ్ వరుస సిక్సర్లు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
6,6,6,6 BY RUTURAJ GAIKWAD IN A SINGLE OVER IN BUCHI BABU...!!!! 😍🔥 pic.twitter.com/LhoA6JKKiQ
— Johns. (@CricCrazyJohns) August 26, 2025
ఈ వీడియో చూసి సీఎస్‌కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్‌లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఆ సీజన్‌లో రుతురాజ్ మెరుపులు మిస్ అయ్యారు. తమ కెప్టెన్ టచ్‌లోకి రావడంతో వారి ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.
హిమాచల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ క్లాసికల్ సెంచరీ బాది తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మరో సెంచరీ వీరుడు అర్షిన్ కులకర్ణితో (146) కలిసి 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్.. ఆతర్వాత ఎదుర్కొన్న 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
రుతురాజ్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత-ఏ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశాలు రాలేదు. అనంతరం రుతు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. బుచ్చిబాబు టోర్నీలో రుతురాజ్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఛత్తీస్ఘడ్పై 1, 11 పరుగులు మాత్రమే చేశాడు.
రుతురాజ్ త్వరలో దులీప్ ట్రోఫీలో కనిపించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి చాలా మంది టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్‌కు ఆడనున్నాడు.