
టీమిండియా ఫాస్ట్ బౌలర్, జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ రీఎంట్రీలో అదరగొట్టాడు. బుచ్చిబాబు టోర్నీలో భాగంగా ఒడిషాతో జరిగిన మ్యాచ్‌లో రాకెట్ వేగంతో బంతులు సంధించి, వరుస బంతుల్లో వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లు క్లీన్ బౌల్డ్ రూపంలో వచ్చాయి. రీఎంట్రీలో ఉమ్రాన్ పూర్వవైభవం సాధించాడు. తనను ప్రత్యేకంగా నిలిపిన వేగాన్ని కొనసాగించాడు. నిప్పులు చెరిగే బంతులు సంబంధించి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 10 ఓవర్లు వేసిన ఉమ్రాన్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో జమ్యూ కశ్మీర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. రెండో ఓవర్ చివరి బంతికే ఉమ్రాన్ ఓం ముండే వికెట్ తీశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్ తొలి బంతికి ఒడిషా కెప్టెన్ సుభ్రాంషు సేనాపతి వికెట్ తీశాడు. హ్యాట్రిక్ కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఉమ్రాన్ తీసిన రెండు వికెట్లు తొలి రోజు ఆట మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి. ఉమ్రాన్ వేగానికి వికెట్లు గాల్లోకి పల్టీలు కొట్టాయి.
ఉమ్రాన్ మెరుపులకు ఆబిద్ ముస్తాక్, వన్షజ్ శర్మ నాలుగు వికెట్ల ప్రదర్శనలు కూడా తోడవ్వడంతో జమ్మూ కశ్మీర్ ఒడిషాను తొలి రోజే 314 పరుగులకు ఆలౌట్ చేసింది.
25 ఏళ్ల ఉమ్రాన్ గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతను చివరిగా గతేడాది మార్చిలో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఉమ్రాన్.. భారత్ తరఫున 8 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనల కారణంగా ఉమ్రాన్‌కు భారత జట్టులో చోటు దక్కింది. సన్‌రైజర్స్‌కు ఆడుతూ అతడు మంచి పేరు గడించాడు.
అయితే గాయాల కారణంగా తరుచూ ఇబ్బంది పడ్డాడు. భారత క్రికెట్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఫాస్ట్ బౌలర్లలో ఉమ్రాన్ ఒకడు. అతను క్రమంగా 150 కిమీకి పైగా వేగంతో బంతులు సంబంధించగలడు. భారత క్రికెట్‌లో ఇలా చేయడం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యపడుతుంది.