సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్‌ | Ruturaj Gaikwad Hits Century in Buchi Babu Tournament 2025 for Maharashtra | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్‌

Aug 26 2025 3:10 PM | Updated on Aug 26 2025 3:24 PM

HUNDRED FOR RUTURAJ GAIKWAD IN BUCHI BABU TROPHY

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ దేశవాలీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్‌ 26) హిమాచల్‌ ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ ఎంతో ఓపికగా బ్యాటింగ్‌ చేశాడు. తనలోని క్లాస్‌ను మరోసారి అభిమానులకు రుచి చూపించాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌తో పాటు అర్షిన్‌ కులకర్ణి కూడా సెంచరీతో మెరిశాడు. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు వలస పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి స్కోర్‌ వివరాలు తెలియరాలేదు.

కాగా, బుచ్చిబాబు క్రికెట్‌ టోర్నీ తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలోని వివిధ వేదికల్లో జరుగుతుంది. ఈ టోర్నీ మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి పోటీపడుతున్నాయి. ప్రతి గ్రూపులో టాప్‌లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఈ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్‌ ఖాన్‌, పంజాబ్‌ తరఫున రమన్‌దీప్‌ సింగ్‌, మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా సెంచరీలతో మెరిశారు.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ బుచ్చిబాబు టోర్నీ దులీప్‌ ట్రోఫీ షెడ్యూల్‌తో క్లాష్‌ అవుతుంది. ఈ టోర్నీ ఆఖరి రోజు దులీప్‌ ట్రోఫీ ప్రారంభమవుతుంది. దులీప్‌ ట్రోఫీ ఆడుతున్న ఆటగాళ్లు బుచ్చిబాబు టోర్నీ చివరి రౌండ్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. దులీప్‌ ట్రోఫీ ఆగస్ట్‌ 28 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌, ఈస్ట్‌ జోన్‌ తలపడనున్నాయి. అదే రోజు సెంట్రల్‌ జోన్‌, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ కూడా పోటీపడనున్నాయి. సౌత్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌ నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాయి.

నార్త్‌ జోన్‌కు అంకిత్‌ కుమార్‌ సారథ్యం వహించనుండగా.. సౌత్‌ జోన్‌కు తిలక్‌ వర్మ, సెంట్రల్‌ జోన్‌కు ధృవ్‌ జురెల్‌, వెస్ట్‌ జోన్‌కు శార్దూల్‌ ఠాకూర్‌, ఈస్ట్‌ జోన్‌కు అభిమన్యు ఈశ్వరన్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నీలో రియాన్‌ పరాగ్‌, మొహమ్మద్‌ షమీ, ఆకాశ్‌దీప్‌, ముకేశ్‌ కుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రజత్‌ పాటిదార్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, దేవదత్‌ పడిక్కల్‌, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement