
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై 114 బంతుల్లో 138 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అతడు.. హర్యానాతో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 112 బంతుల్లో 111 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు.
హర్యానాతో మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన జట్టు కష్టాల్లో (81/3) ఉన్నప్పుడు బరిలోకి దిగి సూపర్ సెంచరీతో మెరిశాడు. హార్దిక్ తామోర్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్కును దాటించాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఆతర్వాత 40 బంతుల్లో శతక మైలురాయిని తాకాడు.
టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై కూడా సర్ఫరాజ్ ఇదే తరహాలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా కష్టాల్లో ఉన్న తన జట్టును సెంచరీతో గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 36 పరుగులు చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ తర్వాత ముంబై ఆడిన రెండో మ్యాచ్‌లో (బెంగాల్‌తో) సర్ఫరాజ్ ఖాన్ ఆడలేదు. తిరిగి మూడో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి మరోసారి శతక్కొట్టాడు.
27 ఏళ్ల సర్ఫరాజ్ తాజా ప్రదర్శనలతో భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సర్ఫరాజ్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడ్ని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ పర్యటనలో సర్ఫరాజ్ స్థానంలో అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ దారుణంగా విఫలం కావడంతో సెలెక్టర్లు మళ్లీ సర్ఫరాజ్ ఖాన్ వైపు చూసే అవకాశం ఉంది.
సర్ఫరాజ్ గతేడాదే స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్‌పై భారీ సెంచరీతో (150) మెరిశాడు. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశాలు దక్కలేదు.
కెరీర్‌లో మొత్తం 6 టెస్ట్‌లు ఆడిన సర్ఫరాజ్ సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 37.10 సగటున 371 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. ఆ టోర్నీలో కూడా సర్ఫరాజ్ సెంచరీలు చేస్తే సెలెక్టర్లు అతన్ని తప్పక టెస్ట్ జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.