
టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా కొత్త జర్నీని సెంచరీతో ప్రారంభించాడు. దేశవాలీ క్రికెట్‌లో ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే శతక్కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో షా ఛత్తీస్‌ఘడ్‌పై 122 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ ఇన్నింగ్స్‌లో షా యధేచ్చగా షాట్లు ఆడి కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించాడు. తొలి వికెట్‌కు సచిన్ దాస్‌తో కలిసి 71 పరుగులు జోడించిన అనంతరం మహారాష్ట్ర 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షా ఎంతో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.
25 ఏళ్ల షా గత కొంతకాలంగా ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్యలోనే అతన్ని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా..మకాంను మహారాష్ట్రకు మార్చాడు. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.
టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి భావి సచిన్‌గా కీర్తించబడిన షా.. కొద్దికాలంలోనే వివాదాల్లో తలదూర్చి, ఫామ్ కోల్పోయి, క్రమశిక్షణ లేకుండా విపరీతంగా బరువు పెరిగి చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 2021 జులైలో టీమిండియా తరఫున చివరిసారిగా ఆడిన షా.. ప్రస్తుతం భారత సెలెక్టర్ల పరిధిలోనే లేడు. మహారాష్ట్రతో ప్రయాణం అతన్ని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తుందేమో చూడాలి.