పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్‌, వార్నర్‌ | Sakshi
Sakshi News home page

పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్‌వుడ్‌, వార్నర్‌

Published Wed, May 29 2024 8:34 AM

T20 World Cup 2024 Warm Up Matches: Australia Beat Namibia By 7 Wickets

టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ తరఫున తొలుత హాజిల్‌వుడ్‌.. ఆతర్వాత డేవిడ్‌ వార్నర్‌ రెచ్చిపోయారు. 

హాజిల్‌వుడ్‌ నాలుగు ఓవర్లు బౌల్‌ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్‌ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్‌ ఓవర్లు వేయడం విశేషం. 

హాజిల్‌వుడ్‌తో పాటు ఆడమ్‌ జంపా (4-0-25-3), నాథన్‌ ఇల్లిస్‌ (4-0-17-1), టిమ్‌ డేవిడ్‌ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ జేన్‌ గ్రీన్‌ (38) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. 

స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్‌ మార్ష్‌ 18, ఇంగ్లిస్‌ 5, టిమ్‌ డేవిడ్‌ 23, వేడ్‌ 12 (నాటౌట్‌) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్‌ స్కోల్జ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్‌ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్‌, యూఎస్‌ఏ మధ్య నిన్ననే జరగాల్సిన ‌మరో వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement