భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-భారత్ మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంపై ప్రెజెంటేషన్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. టీ20 సిరీస్‌ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు.
మా కుర్రాళ్లు అద్భుతం..
"వాస్తవానికి వాతావరణం మన నియంత్రణలోని ఆంశం. కార్‌బెర్రాలో పూర్తి మ్యాచ్ జరిగి ఫలితం రావాలని కోరుకున్నాము. దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఆ తర్వాత రెండో టీ20లో ఓటమి పాలైము. అనంతరం బలంగా తిరిగి పుంజుకుని వరుస విజయాలను సాధించాము.
ఇందుకు క్రెడిట్ మా కుర్రాళ్లకు ఇవ్వాల్సిందే. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. బుమ్రా-అర్ష్‌దీప్ సింగ్‌లది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. అదేవిధంగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
వాషింగ్టన్ సుందర్ ఏ ఫార్మాట్‌లో నైనా రాణించగలడు. వాషీ లాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. వారు వ్యూహాలు సరిగ్గా అమలు చేసి జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. మాకు కావలసింది అదే.
గుడ్ హెడెక్
ప్రతీ ఒక్కరూ అద్భుతంగా రాణిస్తుందున తుది జట్టు ఎంపిక మాకు గుడ్ హెడెక్ మారింది. ఆస్ట్రేలియాలో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. స్వదేశంలో మేము దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో రెండు టీ20 సిరీస్‌లు ఆడనున్నాము. ఈ సిరీస్‌లను మేము టీ20 ప్రపంచకప్ సన్నహాకాలగా ఉపయోగించుకుంటాము.
ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. సహజంగా సొంతగడ్డపై వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అదే సమయంలో చాలా ఉత్సాహం,బాధ్యత ఉంటుంది. దేశంలో ఎక్కడ ఆడినా కూడా ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటుంది" అని సూర్య పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం


