దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చేరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా కెరీర్‌ను ఎంచుకున్న ఆ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi).

రంజీల్లో అదుర్స్..
29 ఏళ్ల ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆకిబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీ.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో నకీబ్ ఇప్పటివరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు సాధించాడు.

డెయిల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా
ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. అయితే జమ్మూలోని బారాముల్లాకు చెందిన ఆకిబ్‌ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్‌కు మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
అతడు తన అద్భుత ప్రదర్శనలతో భారత సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. నబీ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు.


