ఐపీఎల్-2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జడేజాకు బదులుగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సీఎస్‌కే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే కచ్చితంగా జడ్డూను తమతో పాటు అట్టిపెట్టుకోవాలని రైనా సూచించాడు. జడేజా ఐపీఎల్-2011 సీజన్ నుంచి సీఎస్‌కే జట్టులో కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్ విజేతగా సీఎస్‌కే నిలవడంలో జడ్డూది కీలక పాత్ర.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఐదో టైటిల్‌ను అందించాడు. అంతకుముందు 2019, 2017 సీజన్‌లో సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలవడంలో జడ్డూ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి ప్లేయర్‌ను వదులుకోవడానికి సీఎస్‌కే సిద్దమైందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.
రవీంద్ర జడేజాను సీఎస్‌కే రిటైన్ చేసుకోవాలి. అతడొక గన్ ప్లేయర్. గత కొన్ని సీజన్లగా సీఎస్‌కే ఎన్నో విజయాలను అందించాడు. కాబట్టి 'సర్ రవీంద్ర జడేజా' జట్టులో కచ్చితంగా ఉండాలి అని రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా సీఎస్‌కే జట్టులో చేయాల్సిన మార్పులు కూడా అతడు సూచించాడు.
"చెన్నై డెవాన్ కాన్వేను జట్టు నుంచి విడుదల చేయాలి. సీఎస్‌కే కచ్చితంగా మినీ వేలంలో ఒక లోకల్ ఓపెనర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక విజయ్ శంకర్, దీపక్ హుడాను కూడా రిలీజ్ చేయాలి. వీరిద్దరికి ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ వాటిని వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఈసారి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని" రైనా చెప్పుకొచ్చాడు.


