
ఐదు టెస్టులు.. ఇరవై ఐదు రోజులు.. ఆద్యంతం ఆసక్తికరం.. ఆఖరి టెస్టు.. ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరు.. టెస్టు క్రికెట్ ప్రేమికుల మది దోచుకున్న సిరీస్.. అదే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 2-2తో సమంగా ముగిసింది.
లీడ్స్‌లో ఇంగ్లండ్, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా గెలవగా.. లార్డ్స్‌లో ఆతిథ్య జట్టు జయభేరి మోగించింది. అనంతరం మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా కాగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను డ్రా చేసింది.
సిరాజ్ మేజిక్
అయితే, ఇరుజట్లు కూడా ఆఖరి నిమిషం వరకు పోరాడిన తీరు అద్భుతం. చివరకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటి టీమిండియా విజయాన్ని ఖరారు చేయడం అభిమానులను ఖుషీ చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ మెగా సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్- ఇండియా నుంచి అత్యుత్తమ తుదిజట్టును ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఎంపిక చేశాడు. తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా జోడీకి స్థానం ఇచ్చిన ఈ లెజెండరీ బౌలర్.. మిడిలార్డర్‌లో మాత్రం ఇంగ్లండ్‌కే పెద్దపీట వేశాడు.
అదనపు భారాన్నీ తానే మోశాడు
ఇక ఆల్‌రౌండర్ జాబితాలో వాషింగ్టన్ సుందర్‌కూ చోటిచ్చిన బ్రాడ్.. పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్‌తో పాటు టీమిండియా ద్వయాన్ని కూడా ఎంపిక చేశాడు. ఓవరాల్‌గా తన జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఐదుగురు ఇంగ్లండ్ ప్లేయర్లకు చోటిచ్చాడు. అయితే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 754 పరుగులు సాధించిన భారత సారథి శుబ్‌మన్ గిల్‌కు మాత్రం అతడు స్థానం కల్పించలేదు.
ఈ సందర్భంగా సిరాజ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు స్టువర్ట్ బ్రాడ్. ‘‘ప్రతిసారి బంతిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బాధ్యతంతా తన మీదే వేసుకున్నాడు. బుమ్రా గైర్హాజరీలో అదనపు భారాన్నీ తానే మోశాడు. పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్ ఉండటం భారత జట్టును మరింత పటిష్టం చేస్తుంది’’ అంటూ స్టువర్ట్ బ్రాడ్ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు.
కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పదకొండు వందలకు పైగా బంతులు వేసిన సిరాజ్ 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ 2025 టెస్టు సిరీస్- స్టువర్ట్ బ్రాడ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జోఫ్రా ఆర్చర్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్