
క్రికెట్ అభిమానులను దాదాపు నెల రోజుల పాటు అలరించిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి సోమవారం(ఆగస్టు 4)తో ఎండ్ కార్డ్ పడింది. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది.
ఈ విజయంలో భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ గెలుపునకు 4 వికెట్లు కావాల్సి ఉండేది. ఈ సమయంలో సిరాజ్, ప్రసిద్ద్ అద్బుతం చేసి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
అయితే భారత చేతిలో ఓటమిని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకుకోలేకపోతున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆడుంటే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించేందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బెన్ స్టోక్స్ ఆఖరి టెస్టు భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
"బెన్ స్టోక్స్ ఆడకపోవడమే ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఒకవేళ అతడు జట్టులో ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. అతడు జట్టును మానసికంగా సిద్దం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు భయపడ్డారు. ఒక చిన్న భాగస్వామ్యం వచ్చి వుంటే వారు గెలిచేవారు.
కానీ అలా చేయలేకపోయారు. స్పష్టంగా వారిలో తీవ్ర ఒత్తడి కన్పించింది. భారీ షాట్లకు ప్రయత్నించి తమ వికెట్లను కోల్పోయారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ పేర్కొన్నాడు. కాగా 374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్‌బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్