కన్నీటిపర్యంతమైన గంభీర్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న వీడియో! | With Tears In Eyes Gambhir Never Seen Before Avatar Stuns Fans Video Viral | Sakshi
Sakshi News home page

కన్నీటిపర్యంతమైన గంభీర్‌.... గూస్‌బంప్స్‌ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్‌

Aug 5 2025 11:00 AM | Updated on Aug 5 2025 11:34 AM

With Tears In Eyes Gambhir Never Seen Before Avatar Stuns Fans Video Viral

భావోద్వేగానికి లోనైన గంభీర్‌ (PC: BCCI X)

‘‘గౌతమ్‌ గంభీర్‌.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.

సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్‌ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.

ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్‌ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి గంభీర్‌ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.

దిగ్గజాలు లేకుండా గిల్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్‌, కెప్టెన్‌ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్‌ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.

ఈ సిరీస్‌ కూడా సమర్పయామి అంటూ..
అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్‌ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.

లార్డ్స్‌ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్‌ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్‌ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.

అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్‌ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్‌ కృష్ణ జోష్‌ టంగ్‌ను బౌల్డ్‌ చేసి తొమ్మిదో వికెట్‌ పడగొట్టాడు.

అద్భుతం చేసిన సిరాజ్‌
ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్‌ అట్కిన్సన్‌ను బౌల్డ్‌ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్‌ గంభీర్‌ హృదయం ఉప్పొంగిపోయింది.

గంభీర్‌ కన్నీటి  పర్యంతం
గతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్‌.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!

ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్‌ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉భారత్‌- 224 & 396
👉ఇంగ్లండ్‌- 247 & 367
✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్‌.

చదవండి: న‌న్ను న‌మ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్‌ సిరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement