నేటి నుంచి లీగ్ షురూ
బరిలో 8 జట్లు, 32 మ్యాచ్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక టి20 లీగ్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అధికారికంగా టీజీ టి20 లీగ్‌ను తొలిసారి నిర్వహించనున్నారు. గతంలో పలు వేర్వేరు లీగ్ టోర్నీలు జరిగినా... బీసీసీఐ అనుమతితో అధికారికంగా టోర్నీని జరపడం ఇదే తొలిసారి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర అసోసియేషన్లు రాష్ట్ర స్థాయిలో వర్ధమాన క్రికెటర్ల కోసం ఇలాంటి టి20 లీగ్‌ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు హెచ్‌సీఏ కూడా ఆ జాబితాలో చేరింది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేడు టోర్నీ మొదలు కానుంది. 22 రోజుల పాటు జరిగే టోర్నీలో ఫైనల్ సహా మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూలై 12న ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. దీనికి ముందు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
160 మంది ప్లేయర్లు...
టీజీ టి20 లీగ్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. హైదరాబాద్ ఇ–చాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్ టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టీమ్‌లకు అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, ప్రజ్ఞయ్ రెడ్డి, రవితేజ, అమన్ రావు, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముందుగా బిడ్ ద్వారా ఎనిమిది మంది ఫ్రాంచైజీలను ఎంపిక చేయగా, ఆ తర్వాత వేలం ద్వారా టీమ్‌లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.
ఒక్కో టీమ్‌లో 20 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించారు. వేలంలో అత్యధికంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మకు రూ.33 లక్షలు దక్కగా, పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు లభించాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్ మిలింద్‌కు అత్యధికంగా రూ. 17 లక్షలు దక్కాయి. ఆటగాళ్ల కోసం అన్ని జట్లు కలిపి మొత్తం రూ. 4.74 కోట్లు వెచ్చించాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా తిలక్, సిరాజ్ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారనే విషయంపై స్పష్టత లేదు.
రూ.49 టికెట్...
తొలిసారి నిర్వహిస్తున్న లీగ్ కోసం హెచ్‌సీఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తుండగా, ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించారు. టోర్నీకి శ్రీనిధి యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తడంతో దీనిపై హెచ్‌సీఏ వివరణ ఇచ్చింది.
లీగ్ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిందని, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణలోనే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఎక్కువ మంది అభిమానులు స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు చూడటం కోసం కేవలం రూ.49 టికెట్‌ను అందుబాటులో ఉంచారు. ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వివరాలు
» కరీంనగర్ డైమండ్స్ – ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ జ్వెలర్స్
» ఖమ్మం ఏసెస్ – అన్విత గ్రూప్
» పాలమూరు స్ట్రైకర్స్ – వీరభద్ర స్టీల్స్
» మెదక్ ఫాల్కన్స్ – బృంద ఇన్‌ఫ్రా
» వరంగల్ వారియర్స్ – బైన్ గ్లోబల్ రిసోర్సెస్
» రంగారెడ్డి రైజర్స్ – బూరుగు ఇన్‌ఫ్రా అండ్ ప్రణవ
» నల్లగొండ నైట్స్ – కిశోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్æ
» హైదరాబాద్ ఇ–చాంపియన్స్– ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్


