టీమిండియాకు షాక్‌.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం | Sri Lanka Beat India By 32 Runs In Second ODI | Sakshi
Sakshi News home page

టీమిండియాకు షాక్‌.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం

Aug 4 2024 10:06 PM | Updated on Aug 5 2024 9:52 AM

Sri Lanka Beat India By 32 Runs In Second ODI

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్‌ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. 

ఛేదనలో రోహిత్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. దీన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (35), అక్షర్‌ పటేల్‌ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్‌ (14), శివమ్‌ దూబే (0), శ్రేయస్‌ అయ్యర్‌ (7), కేఎల్‌ రాహుల్‌ (0) దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్‌ మెండిస్‌ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్‌ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్‌ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. 

భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ 2, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆగస్ట్‌ 7న జరుగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement