ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.
తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.
ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.
క్రీడల్లో హ్యాండ్‌షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.
క్రికెట్‌కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్‌లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.
కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.
ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు.
మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్‌పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు.
ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి.


