రెండో రోజూ బౌలర్ల హవా
నేలకూలిన 15 వికెట్లు
189కే ఆలౌటైన భారత్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93/7
జడేజా ఖాతాలో 4 వికెట్లు
63 పరుగుల ఆధిక్యంలో బవుమా బృందం
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్‌లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్‌కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్‌కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు.
కోల్‌కతా: మార్క్‌రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్‌ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్‌లో సర్వసాధారణమిది.
కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్‌లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్‌లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్‌రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని!
రెండో సెషన్లోనే భారత్ కూలింది!
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్‌లోనే అర్థమైంది.
రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్‌నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్‌నర్‌షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు.
జడేజా ఉచ్చులో పడి...
భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్‌ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది.
కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్‌తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్‌కు 2, అక్షర్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.
92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్‌లు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్‌లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్‌ను దాటేశాడు.
2 తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా జడేజా గుర్తింపు పొందాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్‌రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్‌రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్‌హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్‌రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4.


