గెలవకపోయినా... మనసులు గెలిచి.... | How Cape Verde Became The Smallest Country To Qualify For The 2026 FIFA World Cup, Read Story Inside | Sakshi
Sakshi News home page

గెలవకపోయినా... మనసులు గెలిచి....

Jul 19 2026 5:34 AM | Updated on Jul 19 2026 11:51 AM

Smallest team ever to qualify for 2026 FIFA World Cup

చిన్న జట్లు ... పెద్ద ఘనతలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన మెగా ఈవెంట్‌ మరికొన్ని గంటల్లో ముగియనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రతీసారి ఎన్నో అద్భుత ఘట్టాలను, అనేక చిరస్మరణీయ క్షణాలను మనకు చూపిస్తుంది... అసాధారణ వ్యక్తిగత ప్రదర్శనలు, టీమ్‌ ఘన విజయాలు... ఇలా సగటు అభిమాని మరచిపోలేని ఎన్నో దృశ్యాలు కనుల ముందు కదలాడుతాయి. 2026 ‘ఫిఫా’ ప్రపంచ కప్‌కు సంబంధించి అలాంటి కొన్ని విశేషాలను చూస్తే...

ఖతర్నాక్‌ కేప్‌వెర్డె  
ప్రపంచకప్‌లో ఎప్పుడూ చెలరేగే బలమైన టీమ్‌లతో పాటు కొన్ని చిన్న టీమ్‌లు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఈసారి ఆ జాబితాలో కేప్‌వెర్డె అందరికంటే ముందుంది. సుమారు 5 లక్షల జనాభా గల ఈ అతి చిన్న దేశం కూడా అసాధారణ ఆటతో తమదైన ముద్ర వేసింది. లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడలేదు. తమకంటే ఎంతో బలమైన స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియాలతో మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించి నాకౌట్‌కు అర్హత సాధించింది. రౌండ్‌–32లో అర్జెంటీనా చేతిలో ఓడినా 2 గోల్స్‌ కొట్టి సంతృప్తిగా ముగించింది.

అన్నింటికంటే టీమ్‌ గోల్‌ కీపర్‌ జోస్‌ వొజిన్హా ఆట టోర్నికై హైలైట్‌గా నిలిచింది. 40 ఏళ్ల వయసులో అత్యంత చురుగ్గా ఉంటూ గోల్‌ పోస్ట్‌ ముందు అడ్డుగోడగా అతను నిలిచిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. స్పెయిన్‌లాంటి జట్టు 7 గోల్‌ ప్రయత్నాలను నిలువరించిన అతను అర్జెంటీనా 8 గోల్‌ ప్రయత్నాలను కూడా సమర్థంగా అడ్డుకోగలిగాడు. దాంతో ఒక్కసారిగా అతని ప్రజాదరణ పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 50 వేల నుంచి రాత్రికి రాత్రే 1 కోటి 30 లక్షలకు చేరుకోవడం విశేషం. అంతే కాదు...కొత్తగా బయటపడిన సముద్ర జీవికి కేప్‌వెర్డె గోల్‌ కీపర్‌ గౌరవంగా ‘అల్డిసా వొజిన్హాయ్‌’ అని పేరు పెట్టడం విశేషం.  

ఈజిప్ట్‌...అర్జెంటీనాను వణికించి...
‘ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌’లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచినా... ఈజిప్ట్‌ జట్టు ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేయలేకపోయింది. గతంలో మూడుసార్లు లీగ్‌ దశకే పరిమితమైన టీమ్‌ ఈసారి నాకౌట్‌లోకి అడుగు పెట్టింది. కోచ్‌ హొసామ్‌ హసన్‌ టీమ్‌కు సమర్థంగా దిశానిర్దేశం చేయగా, మైదానంలో స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ సలా తనపై నమ్మకం నిలబెట్టేలా రాణించాడు. ఈ టో ర్నిలో అర్జెంటీనాతో ఆడిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఈజిప్ట్‌ అద్భుత ఆట కనబర్చింది.

ఈ పోరును ఫుట్‌బాల్‌ అభిమానులెవరూ మర్చిపోలేరు. మెస్సీ కొట్టిన పెనాల్టీ కిక్‌ను గోల్‌ కీపర్‌ ముస్తఫా షబీర్‌ అడ్డుకున్న తీరు సూపర్‌. 78 నిమిషాలు పాటు కౌంటర్‌ అటాకింగ్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ను ముచ్చెమటలు పట్టించి టీమ్‌ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే అనూహ్యంగా 13 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్‌ ఇచ్చి ఈజిప్ట్‌ ఓటమిపాలైంది. రిఫరీ పక్షపాతంతో వ్యవహరించాడని, అతని తప్పుడు నిర్ణయాలే తమ ఓటమికి కారణమయ్యామని ఆరోపించిన ఈజిప్ట్‌... చివరకు నాకౌట్‌ చేరి సంతృప్తితో సగర్వంగా ని్రష్కమించింది.

నార్వేను నడిపించిన హాలాండ్‌...
ప్రపంచ కప్‌కు సంబంధించిన నార్వే బలమైన జట్టేమీ కాదు. చివరిసారిగా ఆ జట్టు ఈ మెగా టో ర్నికి అర్హత సాధించినప్పుడు (1998) ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. ఈసారి మాత్రం నార్వే టీమ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. టాప్‌ ప్లేయర్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ అందుకు ఒక కారణం కాగా... ప్రిక్వార్టర్స్‌లో ఆ జట్టు చేసిన సంచలన ప్రదర్శన, ఆపై ఆటగాళ్ల ప్రత్యేక సంబరాలు మరో కారణం. అద్భుతమైన ఆట, మైదానంలో చురుకుదనంతో పాటు తనదైన సరదా శైలితో హాలాండ్‌ సహచరులకంటే భిన్నంగా నిలిచాడు.

ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో హాలాండ్‌ చేసిన రెండు గోల్స్‌ అతడిని గ్లోబల్‌ హీరోగా మార్చాయి. ఆ తర్వాత నార్వే ఆటగాళ్లందరూ కలిసి రోయింగ్‌ తరహాలో చేసే ‘వైకింగ్‌ రో సెలబ్రేషన్‌’ అయితే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా... స్వదేశంలో ఆ జట్టుకు లభించిన ఘన స్వాగతం, భారీ తరహాలో సాగిన ఓపెన్‌ పరేడ్‌ ఈ టో ర్నిలో జట్టు విజయాల విలువను చూపించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement