వరల్డ్‌కప్‌కు ముందు మొహమ్మద్‌ సిరాజ్‌కు భంగపాటు | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌కు ముందు మొహమ్మద్‌ సిరాజ్‌కు భంగపాటు

Published Wed, Oct 4 2023 2:43 PM

Siraj Dropped 11 Points In ODI Rankings, As Hazlewood Climbs To Top Spot Along Siraj - Sakshi

భారత్‌ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023కు ముందు టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు భంగపాటు ఎదురైంది. కొద్ది రోజుల కిందట ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ధారాళంగా పరుగులు (9 ఓవర్లలో 68 పరుగులు) సమర్పించుకున్నందుకు గాను సిరాజ్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 11 పాయింట్లు (680 నుంచి 669) కోల్పోయాడు. తద్వారా అతను ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌తో అగ్రస్థానాన్ని షేర్‌ చేసుకోవాల్సి వచ్చింది.

భారత్‌తో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన హాజిల్‌వుడ్‌ అప్పటివరకు తన ఖాతాలో ఉన్న 669 పాయింట్లను నిలబెట్టుకుని సిరాజ్‌తో పాటు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్‌ 8న జరిగే మ్యాచ్‌లో వీరిరువురిలో టాప్‌ ర్యాంకర్‌ ఎవరో తేలిపోతుంది.

తాజాగా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్‌ ద్వయం ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, రషీద్‌ ఖాన్‌ మూడు, నాలుగు స్థానాలు నిలబెట్టుకోగా.. పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ అఫ్రిది 2 స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండిన మిచెల్‌ స్టార్క్‌ 2 స్థానాలు కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. 11వ ర్యాంక్‌లో ఉండిన మొహమ్మద్‌ నబీ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకగా.. 10వ ప్లేస్‌లో ఉండిన కుల్దీప్‌ యాదవ్‌ 11వ స్థానానికి పడిపోయాడు. ఈ మార్పులు మినహాయించి టాప్‌-10 వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్‌ వెటరన్‌ డేవిడ్‌ వార్నర్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐర్లాండ్‌ హ్యారీ టెక్టార్‌తో సమానంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. 5వ స్థానంలో ఉండిన ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఓ స్థానం దిగజారి ఆరుకు పడిపోగా.. గత వారం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉండిన రోహిత్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. 10వ స్థానంలో ఉండిన ఫకర్‌ జమాన్‌ 11వ ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, శుభ్‌మన్‌ గిల్‌, డస్సెన్‌లు టాప్‌-3 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతుండగా.. విరాట్‌ 9వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 స్థానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. షకీబ్‌, నబీ, సికందర్‌ రజా టాప్‌-3లో కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement