
రోహిత్ శర్మ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్‌కు భారత టెస్ట్ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. టెస్ట్‌ల్లో గిల్‌కు అంత మంచి ట్రాక్ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఐ పెద్దలు అతనివైపే మొగ్గుచూపుతున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆప్షన్స్ ఉన్నా ఆల్ ఫార్మాట్ ఆటగాడని గిల్‌ను వెనకేసుకొస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్ సారథ్యంలోనే భారత్ కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుందన్న విషయం స్పష్టమవుతుంది. మరో రెండు రోజుల్లో గిల్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో భేటి కానున్నాడని తెలుస్తుంది.
ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి ఓ చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అపప్రదను మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు.
సేనా దేశాల్లో ధోని బ్యాటింగ్ సగటు 28.37 కాగా.. రాహుల్ బ్యాటంగ్ సగటు 29.60గా ఉంది. గిల్ విషయానికొస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్ సగటు ధోని, రాహుల్ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్ టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైతే ధోని, రాహుల్‌తో పాటు పైన పేర్కొన్న చెత్త రికార్డును షేర్ చేసుకుంటాడు.
టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్
టెస్ట్ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారంలోపే విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇవాళ (మే 12) ఉదయం కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనను చేశాడు. బీసీసీఐలోని కొందరు పెద్దలు కోహ్లిని రిటైర్మెంట్ విషయంలో వెనక్కు తగ్గాలని కోరినా వినలేదని తెలుస్తుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. తాజాగా టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు.