
భారత టెస్టు జట్టు కొత్త సారథిగా శుబ్‌మన్ గిల్
వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్
ఇంగ్లండ్ టూర్‌కు 18 మందితో జట్టు
కరుణ్ నాయర్, సుదర్శన్‌లకు చోటు
భారత టెస్టు క్రికెట్‌కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్‌కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్‌లోకి రావడం విశేషం.
ముంబై: ఇంగ్లండ్‌తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్‌మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్‌తో సిరీస్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించినా...అతని ఫిట్‌నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్‌ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది.
భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
ఎనిమిదేళ్ల తర్వాత...
33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్‌లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు.
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్‌తో మిడిలార్డర్‌లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం.
షమీ అవుట్...
సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్‌లకు తగిన స్థాయిలో అతని ఫిట్‌నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్‌తో సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు.
‘కోహ్లి, రోహిత్, అశ్విన్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్‌గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు.
గిల్‌లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు.
భారత జట్టు వివరాలు
గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్
భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్‌మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్‌లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్‌లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్‌గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్‌కు ఒకే ఒక మ్యాచ్‌లో సారథ్యం వహించాడు. అయితే భారత్‌కు 5 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్‌కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు.