టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ టీ20 ముంబై లీగ్‌లో తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆ తర్వాత కెప్టెన్‌గా తన జట్టును గెలిపించడమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
టోర్నీలో భాగంగా శనివారం సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నూతన్ కుమార్ (34) పర్వాలేదనిపించాడు.
ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.
ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్‌లోనూ శ్రేయస్ విజృంభించడం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించింది.
ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు.


