
PC: BCCI/IPL.com
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టింది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకోంది.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. జోష్ ఇన్‌గ్లిస్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక్క వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చరిత్ర సృష్టించిన శ్రేయస్..
ఐపీఎల్ చరిత్రలో మూడు వెర్వేరు జట్లును క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్‌లో ఢిల్లీ జట్టును కెప్టెన్‌గా రెండవ స్ధానానికి చేర్చాడు.
సెకెండ్ క్వాలిఫయర్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో శ్రేయస్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్దానంలో నిలిచింది. ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తు చేసి మూడో ఐపీఎల్ టైటిల్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్‌ను క్వాలిఫయర్స్‌కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్