టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్‌డేట్ అందించింది. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఈ హైదరాబాదీ బ్యాటర్ పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ కూడా దూరమైనట్లు వెల్లడించింది.
ఓ శుభవార్త కూడా
అదే సమయంలో టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీకి మాత్రం తిలక్ అందుబాటులోకి రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. వన్‌డౌన్‌లో నిలకడైన ఆట తీరుతో పరుగులు రాబడుతూ కీలకంగా మారిన తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడటం ఖాయం. టీమిండియాకు ఇది సానుకూలాంశంగా మారనుంది.
కాగా తిలక్ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిట్‌నెస్‌ను అందుకొని మెగా టోర్నీ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ టీమిండియాతో చేరనున్నాడు.
జట్టుతోనే శ్రేయస్ అయ్యర్
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ... ఫిబ్రవరి 3న భారత బృందంతో తిలక్ కలుస్తాడని బీసీసీఐ ప్రకటించింది. తిలక్ గైర్హాజరులో కివీస్‌తో తొలి మూడు టీ20ల కోసం ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సిరీస్ ముగిసే వరకు జట్టుతో కొనసాగనున్నాడు. కాగా కివీస్‌తో తొలి మూడు టీ20లో గెలిచి ఇప్పటికే టీమిండియా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్


