భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్‌లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్‌లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.
ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.
దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.
వివాదం ఎలా మొదలైందంటే..?
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.
బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్‌ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది.


