
నేడు లక్నో పోరుతో ముగియనున్న లీగ్ దశ
గెలుపు, టాప్–2లో నిలవడమే ఆర్‌సీబీ లక్ష్యం
విజయంతో సీజన్ ముగించాలనుకుంటున్న సూపర్ జెయింట్స్
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి అంకానికి చేరింది. 66 రోజులుగా జరుగుతున్న లీగ్ దశకు నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫలితంతో తెరపడుతుంది. ఈ సీజన్‌లో ఎప్పుడో నాలుగు జట్లు ‘ప్లే ఆఫ్స్’ చేరాయి. అలాగని ఈ మ్యాచ్ పూర్తిగా నామమాత్రమని కొట్టిపారేయడానికి వీలు లేదు.
ఎందుకంటే ‘ప్లే ఆఫ్స్’ చేరిన నాలుగు జట్లలో ఒకటైన ఆర్‌సీబీ సేఫ్ జోన్ టాప్–2లో నిలిచేందుకు ఇదే ఆఖరి అవకాశం. ఈడెన్ గడ్డపై మార్చి 22న మొదలైన ఐపీఎల్‌లో కోల్‌కతాపై గెలిచి శుభారంభం చేసిన బెంగళూరు... ఇప్పుడు మరో పరాయిగడ్డ లక్నోలోనూ సూపర్ జెయింట్స్‌పై గెలిచి టాప్–2లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్‌లో ఎలాగూ ముందంజ వేయలేకపోయిన లక్నో... కనీసం సొంత ప్రేక్షకుల మధ్య విజయంతో ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది.
మిడిలార్డర్ మెరిపిస్తే...
బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లి మంచి ఆరంభాన్నే ఇస్తున్నారు. హైదరాబాద్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఓపెనింగ్ వికెట్‌కు 7 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. వీళ్లందరూ మూకుమ్మడిగా విఫలమవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. లేదంటే 200 పైచిలుకు లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో విరివిగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్, ఇన్‌గిడి, షెఫర్డ్, సుయశ్‌లు తేలిపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలతనిచ్చింది. అయితే టాప్–2లో నిలిపే కీలకమైన పోరులో సమష్టిగా బాధ్యత కనబరిస్తే ఆర్సీబీకి ఢోకా ఉండదు.
తడాఖా చూపేనా
లక్నో ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరమైంది. అంతమాత్రాన పోరాటానికి విరామమివ్వలేదు. గత రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే ఈ విషయమే అర్థమవుతుంది. సొంతగడ్డపై లక్నో 205 పరుగులు చేసింది. కానీ సన్‌రైజర్స్ దూకుడుతో ఓడింది. ఇక గుజరాత్ గడ్డ అహ్మదాబాద్‌పై టైటాన్స్‌పై 235 పరుగులు చేసి గెలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సులువుగా 200 పైచిలుకు పరుగులు చేసిన లక్నో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది.
ముఖ్యంగా ఓపెనర్లు మిచెల్ మార్‡్ష, మార్క్‌రమ్, మిడిలార్డర్‌లో నికోలస్ పూరన్ ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతున్నారు. లక్నో బ్యాటింగ్‌కు అండ, దండా ఈ ముగ్గురే! బౌలింగ్ విభాగానికి వస్తే రూర్కే, అవేశ్ ఖాన్‌లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో గత మ్యాచ్‌కు దూరమైన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. అతని ప్రవర్తన పక్కనబెడితే స్పిన్‌తో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో వీళ్లందరూ ఆశించిన మేర రాణిస్తే విజయంతో బైబై చెప్పడం ఏమంత కష్టం కానేకాదు.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్ ఇది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోరు సాధ్యమైంది. ఇందులో ఒకసారైతే 206 లక్ష్యఛేదన సులువైంది. టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గుచూపుతుంది.. మంగళవారం వర్ష సూచనైతే లేదు.
తుది జట్లు (అంచనా)
బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), సాల్ట్, కోహ్లి, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఇన్‌గిడి.
లక్నో: రిషభ్ పంత్ (కెపె్టన్), మార్క్‌రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్‌ఖాన్, ఆకాశ్‌దీప్, విల్ రూర్కే.