అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Breaks Silence After West Indies Chase Down 250 To Level Series 1-1 | Sakshi
Sakshi News home page

అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌

Oct 10 2026 8:39 AM | Updated on Oct 10 2026 9:27 AM

Shreyas Iyer Breaks Silence After West Indies Chase Down 250 To Level Series 1-1

రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఏకంగా 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. విండీస్ జట్టు ఈ భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. స్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (102), షెఫానే రూథర్‌ఫోర్డ్ (84) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగి తమ జట్టుకు రికార్డు విజయాన్ని అందించారు.

భారీ స్కోరు చేసినా తప్పని ఓటమి
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (82) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (43), తిలక్ వర్మ (44),  శ్రేయస్ అయ్యర్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు.

మా ఓటమికి కారణమిదే
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.  మంచు  ప్రభావం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని అతడు తెలిపాడు.

"అద్భుత విజయం సాధించిన వెస్టిండీస్‌కు నా అభినందనలు. నిజం చెప్పాలంటే టీ20 ఫార్మాట్‌లో ఏ స్కోరూ సురక్షితం కాదని మరోసారి రుజువైంది. మంచు ప్రభావం ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. 

249 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ప్రత్యర్థి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పిచ్‌పై బౌలర్లు చిన్న పొరపాటు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. లైన్ తప్పితే బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోతుంది.

మేము కూడా కొన్ని తప్పిదాలు చేశాము. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు విడిచాము. కానీ అదంతా ఆటలో సహజమే. ఏదేమైనప్పటికీ విండీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఇక బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.

ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి మమ్మల్ని గేమ్‌లో ఉంచాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా పుంజుకుంటాం" అని అయ్యర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement