
ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటేలా కన్పించినప్పటికి భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది.
ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(69) అద్భుతపోరాటంతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌పై విమర్శలు గుప్పించాడు. జట్టు ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయని, యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అక్తర్ మండిపడ్డాడు.
"టీమ్ మెనెజ్‌మెంట్ సరైన వ్యూహాలను రచించడంలో పూర్తిగా విఫలమైంది. సెన్స్‌లెస్ కోచింగ్. హెడ్ కోచ్ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు కోచ్‌గా పనికిరాడు. ఇలా కఠినంగా మాటలు ఆడుతున్నందుకు క్షమించండి. జట్టు సెలక్షన్ కూడా బాగోలేదు.
యువ ఆటగాడు హసన్ నవాజ్‌ను మళ్లీ బెంచ్‌కే పరిమితం చేశారు. అతడొక మ్యాచ్ విన్నర్. అయినా అతడిని ఆడించడం లేదు. అంతేకాకుండా పేసర్ సల్మాన్ మీర్జా ఓ అవకాశమివ్వాల్సింది. ఒక్క మ్యాచ్‌లో కూడా అతడిని ఆడించలేదు. ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది.
దేశం మొత్తం గెలుపు కోసం ఎదురు చూసింది. కానీ మరోసారి మమ్మల్ని నిరాశపరిచారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ కష్టాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అందరికి ఆ విషయం తెలుసు. కానీ అందుకు పరిష్కారం మాత్రం మెనెజ్‌మెంట్ వెతకడం లేదు.
మిడిలార్డర్‌లో మొహమ్మద్ నవాజ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతేకాకుండా లోయార్డర్‌లో బ్యాటర్లు కనీసం 50 పరుగులు జోడించాలని ఆశిస్తున్నారు. కొన్ని సార్లు షాహీన్ అఫ్రిదిని ఫహీమ్ అష్రఫ్ కంటే ముందు బ్యాటింగ్ పంపుతున్నారు. ఆఖరిలో వారు రాణిచండం వల్లే 175 పరుగులకు చేరుకోగల్గుతున్నారు. ఏదేమైనప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది.
సల్మాన్ కెప్టెన్సీ కూడా బాగోలేదు. బౌలింగ్ మార్పులు చేయడంలో అతడు విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు.. హారిస్ రౌఫ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అతడు ఒకే ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌ను టర్న్ చేసింది. పాక్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని తప్మాడ్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.