
ఐపీఎల్-2026కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే సమాధానమే ఎక్కువవగా వినిపిస్తోంది. శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను రాయల్ యాజమాన్యం విడిచిపెట్టేందుకు సిద్దంగా లేనప్పటికి.. సంజూ మాత్రం ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో రాజస్తాన్ కెప్టెన్‌గా ఎంపికైన శాంసన్.. ఐదు సీజన్ల పాటు జట్టును బాగానే నడిపించాడు.
ఐపీఎల్-2022లో రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత 2024 సీజన్‌లో రాజస్తాన్ ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ట్రేడింగ్ రూమర్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి రాజస్తాన్ జట్టులోకి వస్తాడని, అంతేకాకుండా ఆ టీమ్ కెప్టెన్‌గా ఎంపికవుతాడని చోప్రా జోస్యం చెప్పాడు.
"రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సీఎస్‌కేకి ట్రేడ్ అయ్యే అవకాశముంది. ఒకవేళ అతడు చెన్నై జట్టులోకి వచ్చిన కెప్టెన్సీ పగ్గాలు అయితే అప్పగించరు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్‌ను కొన్ని సీజన్ల పాటు కెప్టెన్‌గా సీఎస్‌కే కొనసాగించవచ్చు.
ఇదే క్రమంలో అశ్విన్ తిరిగి రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లవచ్చు. అంతేకాకుండా ఆ జట్టు పగ్గాలను అప్పగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సంజూ బయటకు వెళ్లిపోతే రాజస్తాన్ కెప్టెన్‌గా ఎవరు అవుతారన్నది ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను.
ధ్రువ్ జురెల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేడు. అందుకు ఇంకా సమయం పడుతుంది. యశస్వి జైశ్వాల్ కెప్టెన్ అవ్వాలనే కోరిక అయితే ఉంది. కానీ అతడిపై కెప్టెన్సీ భారాన్ని రాజస్తాన్ మోపుతుందని నేను అనుకోవడం లేదు. రియాన్ పరాగ్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. అతడు గత సీజన్‌లో పర్వాలేదన్పించాడు.
సంజూ సీఎస్‌కేకు వెళ్తే వారికి ఫ్యూచర్ వికెట్ కీపింగ్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. కాబట్టి ఎంఎస్ ధోని తనకు నచ్చినది చేయగలడు. అదేవిధంగా ఆర్‌ఆర్‌కు ఆఫ్ స్పిన్నర్ కూడా అవసరం. గత సీజన్‌లో వనిందుకు హసరంగా, మహీష్ తీక్షణ అంత మెరుగ్గా రాణించలేకపోయారు. కాబట్టి అశ్విన్‌ను తీసుకుంటే వారికి ఆఫ్ స్పిన్నర్‌తో పాటు కెప్టెన్సీ అప్షన్ కూడా లభిస్తోంది.