భారత క్రికెట్‌లో ‘సుదర్శన’ మంత్రం | Sai Sudarshan likely to be included in Team India for Test series against England | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌లో ‘సుదర్శన’ మంత్రం

May 23 2025 4:05 AM | Updated on May 23 2025 4:05 AM

Sai Sudarshan likely to be included in Team India for Test series against England

ఐపీఎల్‌లో సత్తా చాటిన తమిళనాడు బ్యాటర్‌

మూడు ఫార్మాట్‌లలో నిలకడైన రికార్డు

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియాలో అవకాశం!

దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్‌... తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్‌ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్‌ హ్యాండ్‌’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. 

ఒకవైపు సీనియర్‌ జగదీశన్‌ చెలరేగుతుండగా మరో ఓపెనర్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్‌ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్‌ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. 

తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్‌. అతనికిదే తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ఆటతో ‘ఆల్‌ ఫార్మాట్‌’ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్‌ ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు.  - సాక్షి క్రీడా విభాగం 

రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో ఒక సీజన్‌ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్‌లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్‌ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్‌లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్‌గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్‌కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా సుదర్శన్‌కు గుర్తింపు లభించింది.

రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్‌ ట్రాక్‌’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్‌ సమర్థంగా ఉపయోగించుకున్నాడు.  

చూడచక్కటి ఆటతో... 
సుదర్శన్‌ బ్యాటింగ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్‌’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్‌లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్‌లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్‌ షాట్‌లతో పాటు స్లాగ్‌ స్వీప్‌లు, స్కూప్‌ షాట్‌లను కూడా ఐపీఎల్‌లో సుదర్శన్‌ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్‌ ఊపే తత్వం కాదు. 

తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్‌లో నాలుగు సీజన్ల కెరీర్‌ చూస్తే అతని బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్‌లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్‌ బ్యాటింగ్‌పై నమ్మకాన్ని చూపిస్తోంది. 

సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్‌లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్‌ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్‌లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్‌కు సరిపోగల బ్యాటింగ్‌ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్‌ అతనిలో పుష్కలంగా ఉన్నాయి.  

అమ్మా నాన్న అండతో... 
సాయి సుదర్శన్‌ ఇప్పటికే భారత సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్‌ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్‌ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్‌లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. 

అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్‌ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్‌తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్‌ అయిన తండ్రి భరద్వాజ్‌ ‘శాఫ్‌’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్‌ ఆడింది. 

పదేళ్ల వయసులో క్రికెట్‌ మొదలు పెట్టిన సుదర్శన్‌ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్‌–19 చాలెంజర్‌ ట్రోఫీ తర్వాత భారత్‌ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్‌గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్‌లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు.  

టెస్టులకు చేరువలో...
దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్‌తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్‌ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్‌ క్లాస్‌ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్‌లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్‌లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్‌లో రాహుల్‌ ఓపెనింగ్‌ స్థానానికి మారితే మిడిలార్డర్‌ సుదర్శన్‌కు సరైన స్థానం కాగలదు. 

పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో ‘సర్రే’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్‌ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్‌ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement