source: X
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్‌లో ఓ భారీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాన్ వికెట్‌కీపర్ ప్లేయర్‌గా జో రూట్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో స్టీవ్ క్యాచ్‌ల సంఖ్య 221కు చేరింది. ప్రస్తుతం రూట్ ఖాతాలో 220 క్యాచ్‌లు ఉన్నాయి. రూట్ 220 క్యాచ్‌లను 169 టెస్ట్‌ల్లో అందుకోగా.. స్టీవ్ కేవలం 126 మ్యాచ్‌ల్లో రూట్ రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో స్టీవ్, రూట్ తర్వాతి స్థానాల్లో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (164 మ్యాచ్‌ల్లో 210 క్యాచ్‌లు), శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (149), సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కల్లిస్ (166) ఉన్నారు.
ఇదే మ్యాచ్‌లో స్టీవ్ బ్యాటింగ్‌లోనూ మరో ఘనత సాధించాడు. తన దేశం తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ వా (10927)ను అధిగమించి మూడో స్థానానికి చేరాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన స్టీవ్ తన టెస్ట్ పరుగుల సంఖ్యను 10945కు పెంచుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాట్ రెన్షా (190) వీరోచిత శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 390 పరుగులు చేసింది. రెన్షాకు కమిన్స్ (43), లియోన్ (27), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (25) సహకరించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ముల్దర్ 4, యాన్సెన్ 3, నోర్జే 2, హార్మర్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. మార్క్రమ్ (37), రికెల్టన్ (0), బెడింగ్హమ్ (49), బవుమా (3) ఔట్ కాగా... స్టబ్స్ (14), ముల్దర్ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, లియోన్‌కు తలో వికెట్ దక్కింది.
ఇదీ చదవండి: సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్ బౌలర్ ప్రపంచ రికార్డు


