
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).
ఈ మ్యాచ్‌లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్‌లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.
వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్‌వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).
అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు.
ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది.