గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 28 వరకు రెండో సీజన్
సాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం భారత యువ క్రీడాభిమానులకు అలరించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక కావడం విశేషం. నేడు ప్రారంభం కానున్న రగ్బీ లీగ్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో 34, మహిళల విభాగంలో 14 కలిపి 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి.
పురుషుల విభాగంలో 6 టీమ్‌లో బరిలో నిలిచాయి. చెన్నై బుల్స్ డిఫెండింగ్ చాంపియన్ కాగా...హైదరాబాద్ హీరోస్, ఢిల్లీ రెడ్స్, కోల్‌కతా బంగా టైగర్స్, ముంబై డ్రీమర్స్, బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ పోటీ పడుతున్నాయి. గత ఏడాది టోర్నీలో హైదరాబాద్ హీరోస్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇవే పేర్లతో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జట్లకు మహిళల విభాగంలో ప్రాతినిధ్యం లేదు.
రగ్బీ సెవెన్ ఫార్మాట్‌లో లీగ్‌ను నిర్వహిస్తారు. 22 నిమిషాల పాటు జరిగే ఒక్కో మ్యాచ్‌ను నాలుగు క్వార్టర్‌లుగా నిర్వహిస్తారు. మ్యాచ్‌లో ఒక్కో క్వార్టర్ తర్వాత 2 నిమిషాల చొప్పున మూడు ‘బ్రేక్’లు ఉంటాయి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రీమియర్ లీగ్ కమిషనర్ అయిన రాహుల్ బోస్ ట్రోఫీతో పాటు టోర్నీ ప్రత్యేక బంతిని ఆవిష్కరించారు.


