మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ అతడు. సీనియర్లను సైతం పక్కనపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలతో భారత క్రికెట్ జట్టుకు మూడు ట్రోఫీలు అందించిన ఘనుడు.
పొట్టి ఫార్మాట్లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్-2007ను గెలిచిన ధోని.. తర్వాత వన్డే వరల్డ్‌కప్-2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 టైటిళ్లను కూడా కెప్టెన్‌గా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
44 ఏళ్ల వయసులోనూ...
ముఖ్యంగా ఐపీఎల్‌లో ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ధోని.. 44 ఏళ్ల వయసులోనూ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగడం విశేషం. ఇక లెజెండరీ క్రికెటర్‌గానే కాదు మిస్టర్ కూల్‌గానూ ధక్షనికి పేరున్న విషయం తెలిసిందే. మైదానంలోనే కాదు.. బయట కూడా ధోని సరదాగా ఉంటూనే తన పనులు చక్కబెట్టుకుంటాడు.
ఇక ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి తలాను నేరుగా చూస్తే చాలని పరితపించిపోయేవారు కోకొల్లలు. ఓ అభిమానికి ధోనిని కలవాలన్న కల నెరవేరడంతో పాటు.. అతడి ఆటోగ్రాఫ్ కూడా లభించడంతో అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ముంజేయిపై కూడా
ఆటోగ్రాఫ్ ఇస్తేనే అంత ఆనందమా? అంటే.. అవును.. ఇదొక ప్రత్యేకమైన ఆటోగ్రాఫ్. అభిమానికి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. డీజిల్ ట్యాంకుపై ధోని తన స్వహస్తాలతో సంతకం చేశాడు. అంతేకాదు.. అతడి ముంజేయిపై కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది
ఈ నేపథ్యంలో.. ‘‘ఇప్పుడు నీ బైక్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 30 కోట్లకు పెరిగింది బ్రో. ఒకవేళ అంత మొత్తం చెల్లించినా నువ్వు ఈ బైక్ ఇస్తావనే నమ్మకమైతే లేదు. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’ అంటూ ధోని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో సదరు అభిమాని ఓ ఫన్నీ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన బైక్‌పై సంతకం చేస్తున్న వేళ ఓ వ్యక్తి తన తలపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరగా.. తాను డస్ట్‌బిన్‌పై సంతకం చేయనని తలా చెప్పినట్లు వివరించాడు. అంతేకాదు.. తాను ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత బైక్ రైడ్ ఎలా సాగుతుందో కూడా తనకు చెప్పాలని ధోని అడిగినట్లు తెలిపాడు.
కాగా ధోనికి బైకులు, కార్లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. రాంచిలోని ధోని నివాసంలో అతడి ఫేవరెట్ ఆటోమొబైల్స్‌తో కూడిన గ్యారేజీ అత్యంత ప్రత్యేకం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సందర్భంగా మళ్లీ ధోనిని మైదానంలో చూసే అవకాశం ఉంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!


