రోహిత్‌ శర్మ పొట్ట.. మ్యాగీ మ్యాన్‌ అంటూ హేళనలు! కట్‌చేస్తే.. | Rohit Sharma Saw Visual With An Arrow Pointing At His Tummy: How Maggi Man Became Hitman | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ పొట్ట చుట్టూ గీత.. మ్యాగీ మ్యాన్‌ అంటూ హేళనలు! కట్‌చేస్తే..

Published Tue, Jun 18 2024 5:22 PM | Last Updated on Tue, Jun 18 2024 6:38 PM

Rohit Saw Visual With An Arrow Pointing At His Tummy How Maggi Man became Hitman

‘‘2011 ప్రపంచకప్‌ జట్టుకు రోహిత్‌ శర్మ ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను తనతో మాట్లాడాను. అప్పటికి కాస్త అధిక బరువుతో ఉన్నాడు.

ఓ యాడ్‌లో యువరాజ్‌ సింగ్‌తో కలిసి నటించాడు. టీవీలో చూసిన ఆ యాడ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను. అందులోని ఓ విజువల్‌ కట్‌ చేసి రోహిత్‌ టమ్మీ(పొట్ట) చుట్టూ ఓ గీత గీశారు. 

అప్పుడు రోహిత్‌తో నాతో పాటే ఉన్నాడు. ఫిట్‌నెస్‌ విషయంలో కాస్త హార్డ్‌వర్క్‌ చేయమని చెప్పాను. తాను కచ్చితంగా మారతానని బదులిచ్చాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకే రోహిత్‌ శర్మ హిట్‌మ్యాన్‌గా మారాడు. కెరీర్‌ పట్ల తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తను ఎలా అయితే ముందుకు సాగాలని అనుకున్నాడో అందుకు తగ్గట్లుగానే శ్రమించాడు.

ఒక క్రికెటర్‌ ఇంతగా మారిపోవడం నేను అదే మొదటిసారి చూడటం. కేవలం మారిపోవడమే కాదు విజయవంతమైన ఆటగాడిగా ఎదిగాడతడు.

చాలా మంది రోహిత్‌ శర్మను చాలా మంది చాలా రకాలుగా కామెంట్‌ చేశారు. రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్‌ అంటూ హేళన చేశారు. అయితే, తను వీటన్నిటినీ దాటుకుని పూర్తిగా మారిపోయి.. హిట్‌మ్యాన్‌ అయ్యాడు.

నువ్వేం చెబితే అది చేస్తా. ఐపీఎల్‌ తర్వాత నువ్వు ఒక కొత్త రోహిత్‌ శర్మను చూస్తావని ఆరోజు నాతో అన్నాడు. అన్నట్లుగానే చేసి చూపించాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ అభిషేక్‌ నాయర్‌ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే రోహిత్‌ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడని ప్రశంసించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడిన రోహిత్‌.. తన అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో అడుగుపెట్టాడు.

టీ20 ప్రపంచకప్‌-2007 జట్టులో భాగమైన అతడు.. ఆ తర్వాత పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2011 వన్డే వరల్డ్‌కప్‌ టీమ్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.

ఈ క్రమంలో.. బొద్దుగా ఉన్న రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. మళ్లీ గాడిలో పడ్డాడు. నాటి కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తనను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేయగా.. అదే స్థానంలో పాతుకుపోయి.. కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు.

ఈ విషయాలను నెమరువేసుకున్న ముంబై మాజీ క్రికెటర్‌‌, కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ రోహిత్‌ శర్మతో తన అనుబంధం గురించి రణ్‌వీర్‌ అల్హాబాదియా పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. 

కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2024తో బిజీగా ఉన్నాడు. అతడి సార థ్యంలో భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement