
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు.
ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.
వరుసగా రెండు శతకాలు
తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.
దూకుడుగా ఆడుతూ
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్‌లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.
అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్‌పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.
విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు
🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్‌పై 23 సిక్సర్లు
🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు
🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు
🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్‌పై 16 సిక్సర్లు
🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్‌పై 16 సిక్సర్లు.
భారత్ 177/3 @ లంచ్ బ్రేక్
ఇక ఓవర్‌నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్‌పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.
పంత్ 65 పరుగులు చేసి...
కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగు
It’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b
— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025