'అప్పుడు ధోని.. ఇప్పుడు టీమిండియాకు అతడే నయా ఫినిషర్‌' | Rinku Singh Will Be Indias Next MS Dhoni: Abhishek Nayar | Sakshi
Sakshi News home page

IND vs AUS: 'అప్పుడు ధోని.. ఇప్పుడు టీమిండియాకు అతడే నయా ఫినిషర్‌'

Published Fri, Nov 24 2023 4:10 PM | Last Updated on Fri, Nov 24 2023 4:32 PM

Rinku Singh Will Be Indias Next MS Dhoni: Abhishek Nayar - Sakshi

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. విశాఖపట్నం  వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత విజయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(80), ఇషాన్‌ కిషన్‌(58), రింకూ సింగ్‌(22) కీలక పాత్ర పోషించారు. కాగా భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో హైడ్రామా నెలకొంది.

చివరి ఓవర్‌లో భారత్‌ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్‌ తొలి బంతికే బౌండరీ బాది విజయానికి చేరువ చేశాడు. అనంతరం రెండో బంతికి రింకూ సింగిల్‌ తీసి అక్షర్‌ పటేల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే ఇక్కడే మ్యాచ్‌ ఊహించని మలుపు తిరిగింది. మూడో బంతికి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఔట్‌ కాగా.. నాలుగో బంతికి రింకూకు స్ట్రైక్‌ ఇచ్చే ప్రయత్నంలో బిష్ణోయ్‌ రనౌటయ్యాడు. అనంతరం బంతికి రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్‌దీప్‌ కూడా రనౌటయ్యాడు.

ఈ క్రమంలో ఆఖరి బంతికి భారత విజయానికి ఒక్కపరుగు అవసరమైంది. స్ట్రైక్‌లో ఉన్న రింకూ చాలా కూల్‌గా బంతిని స్టాండ్స్‌కు తరలించి జట్టును అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడు కొట్టిన బంతి నోబాల్‌ కావడంతో సిక్స్‌ను అంపైర్‌లు పరిగణలోకి తీసుకోలేదు.

టీమిండియా నయా ఫినిషర్‌..
కాగా తీవ్ర ఒత్తిడిలో జట్టును గెలిపించిన రింకూ సింగ్‌పై భారత మాజీ క్రికెటర్‌ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫినిషింగ్‌లో రింకూ ఒక మాస్టర్‌ అని నాయర్‌ కొనియాడాడు. 

"రింకూ సింగ్‌ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌, దేశీవాళీ క్రికెట్‌లో ఈ తరహా ప్రదర్శన చేసిన వారు గురించి మనం​ మాట్లాడుతూ ఉంటాం. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఫినిషర్‌ రోల్‌ పోషించడం అంత ఈజీ కాదు. రింకూ చాలా ప్రశాంతంగా మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అతడు భారత జట్టు తరపున ఈ తరహా ఇన్నింగ్స్‌ ఆడటం ఇది మూడో సారి.

కానీ ఈ ఇన్నింగ్స్‌ మాత్రం రింకూకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొవడం అంత సులభం కాదు. అతడేమి ఐదు-ఆరేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం లేదు. కానీ అంతకమించి తన ఇన్నింగ్స్‌లో పరిపక్వత చూపించాడు.

అతడు ఫినిషింగ్‌లో మాస్టర్‌లా కన్పిస్తున్నాడు. ఇప్పటివరకు ధోని, హార్దిక్‌ మాత్రమే భారత జట్టులో ఈ తరహా పాత్ర పోషించారు. వీరిద్దరి తర్వాత నా దృష్టిలో రింకూనే" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్‌ పేర్కొన్నాడు.
చదవండి:  రోహిత్‌ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్‌ కాకుండా ఉంటారు?: ఆశిష్‌ నెహ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement