టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.
ఏ గ్రూప్‌లో ఏ జట్లు?
గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.
అదే విధంగా గ్రూప్-ఢిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాక్‌కు ఓటమి తప్పదు
‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్‌ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్ పేర్కొన్నాడు.
ఫైనల్ చేరేది ఆ జట్లే!
ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్ క్లార్క్ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.
ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో ర్యాంకులో ఉంది.
చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ’


