భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వన్డే కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.
అనంతరం తాజాగా న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొట్టమొదటి సారి కివీస్‌కు భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలి వన్డేలో విజయం సాధించిన గిల్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండో వన్డేల్లోనూ ఓటమిపాలైంది. అయితే, ఈ సిరీస్‌లో కివీస్ తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడటం గమనార్హం.
గిల్‌పై వేటు.. రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వండి
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై వేటు వేసి వన్డే కెప్టెన్సీని తిరిగి రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.
ఈ మేరకు.. ‘‘ఇప్పటికీ సమయం మించిపోలేదు. తప్పును సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు. ముందుంది వరల్డ్‌కప్ టోర్నీ. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు.
అసలు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కివీస్‌తో సిరీస్‌లో గనుక రోహిత్ కెప్టెన్‌గా ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అతడి సారథ్యంలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.
రోహిత్ కెప్టెన్‌గా ఉంటే
అప్పుడే జట్టు సరైన దిశలో వెళ్తోందని నాకు అనిపించింది. గిల్ కంటే రోహిత్ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్. అతడొక విజయవంతమైన సారథి. గిల్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే, రోహిత్ కెప్టెన్‌గా ఉంటే జట్టు కచ్చితంగా చాంపియన్‌గా నిలుస్తుంది. ఇందుకు 85- 90 శాతం అవకాశం ఉంది’’ అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మనోజ్ తివారి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి
కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2027లోనూ భారత జట్టును ముందుకు నడిపించాలని రోహిత్ భావించగా.. బీసీసీఐ అనూహ్య రీతిలో అతడిపై వేటు వేసింది. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్‌ను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు అప్పగించింది.
ఇక అంతకుముందే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో గిల్ సారథిగా నియమితుడయ్యాడు. మరోవైపు.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. సారథిగా సూర్య అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్


