ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం | Riley Meredith Plays AUS vs BAN 2nd ODI Despite Not Being In Australia Squad | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం

Jun 11 2026 3:16 PM | Updated on Jun 11 2026 3:24 PM

Riley Meredith Plays AUS vs BAN 2nd ODI Despite Not Being In Australia Squad

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (జూన్‌ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరిడిత్‌ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్‌ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

ముందుగా జట్టులో లేని మెరిడిత్‌ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్‌ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్‌ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్‌ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్‌పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్‌లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్‌లో  5 ఓవర్లు వేసిన మెరిడిత్‌ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా‌ తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్‌ బ్యాటింగ్‌ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్‌, కన్నోల్లీ, నాలుగో నంబర్‌ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.

లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్‌ అతికష్టం​ మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్‌ ఇం​కా ప్రారంభం కాలేదు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌, బార్ట్‌లెట్‌తో పాటు కెప్టెన్‌ ఇంగ్లిస్‌ (34), గ్రీన్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్‌ (జంపా) కూడా డకౌటయ్యాడు. 

బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (7-2-27-3), తస్కిన్‌ అహ్మద్‌ (8-1-33-3) చెలరేగి బౌలింగ్‌ చేశారు. ఆసీస్‌ ఈ మ్యాచ్‌ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్‌ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌ చేతిలోనూ ఆసీస్‌ 1-2 తేడాతో వన్డే సిరీస్‌ కోల్పోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఆసీస్‌ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement