
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్‌లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్‌గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్‌రౌండర్. కెప్టెన్ గిల్‌తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.
కాగా, ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.
చాన్స్ లేదా?
నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్‌కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్‌కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్‌మన్‌కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.
కలిసిరాని కెప్టెన్సీ
అయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్‌గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.
నంబర్ 1 ఆల్‌రౌండర్
ఆల్‌రౌండర్‌గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్‌తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్‌తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో టాప్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్
గిల్ గురించి జడేజా..
ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్‌మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్‌ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు.