ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా | ENG VS IND 2ND TEST: RAVINDRA JADEJA IS THE ONLY CRICKETER TO HAVE 2000 PLUS RUNS AND 100 PLUS WICKETS IN WTC HISTORY | Sakshi
Sakshi News home page

ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ఆటగాడు

Jul 4 2025 3:37 PM | Updated on Jul 4 2025 4:35 PM

ENG VS IND 2ND TEST: RAVINDRA JADEJA IS THE ONLY CRICKETER TO HAVE 2000 PLUS RUNS AND 100 PLUS WICKETS IN WTC HISTORY

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది (తొలి ఇన్నింగ్స్‌లో).

భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.

మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్‌ ఆడుతున్న ఆకాశ్‌దీప్‌ వరుస బంతుల్లో తొలి టెస్ట్‌ సెంచరీ హీరోలు బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌లను డకౌట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ పట్టడంతో జాక్‌ క్రాలే (19) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రూట్‌ (18), బ్రూక్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు.

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
ఈ మ్యాచ్‌లో గిల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు జీవం పోసిన జడేజా ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

అప్పటికే బౌలర్‌గా 132 వికెట్లు తీసిన జడ్డూ.. డబ్ల్యూటీసీలో 2000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో మొత్తం 41 మ్యాచ్‌లు ఆడిన జడేజా తాజా ఇన్నింగ్స్‌తో కలుపుకొని 39 సగటుతో 2010 పరుగులు చేశాడు.బౌలింగ్‌లో 25.92 సగటున 132 వికెట్లు తీశాడు.

ఎ‍డ్జ్‌బాస్టన్‌ అంటే చాలు పూనకాలు వస్తాయి..!
రవీంద్ర జడేజాకు ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం అంటే చాలు పూనకాలు వస్తాయి. జడ్డూ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2022 పర్యటనలో సెంచరీ (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) చేసిన జడ్డూ.. ఈసారి కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. నాడు రిషబ్‌ పంత్‌తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. తాజాగా గిల్‌తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement