
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా (Ramiz Raja) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. పాక్ వెటరన్ ఆటగాడు నొమన్ అలీ (Noman Ali)ని ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సొంత జట్టు అభిమానులే రమీజ్ రాజాపై మండిపడుతున్నారు. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా పాక్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది.
బాబర్ ఆజం విఫలం
ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76), సల్మాన్ ఆఘా (93) రాణించగా.. మాజీ సారథి బాబర్ ఆజం (Babar Azam) 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 378 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మేర్ బౌలింగ్‌లో బాబర్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ ముందుగా నాటౌట్ ఇవ్వగా.. సౌతాఫ్రికా ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లింది. ఇందులో బంతి ముందుగా ప్యాడ్‌ను తాకినట్లు (లెగ్ స్టంప్ ఎగిరినట్లు) తేలింది. ఫలితంగా థర్డ్ అంపైర్ బాబర్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
రివ్యూతో గట్టెక్కాడు
ఇక అంతకు ముందు ఒక పరుగు వద్ద ఉన్న వేళ బాబర్ ఆజం రివ్యూతో గట్టెక్కాడు. ముతుసామి వేసిన బంతిని ఆడటంలో బాబర్ విఫలం కాగా.. ప్రొటిస్ బౌలర్లు మాత్రం అప్పీలు చేశారు. ఈ క్రమంలో బంతిని బ్యాట్‌ను తాకలేదని భావించిన బాబర్ రివ్యూకు వెళ్లగా.. అతడికి అనుకూల ఫలితం వచ్చింది.
కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడు
ఈ విషయం గురించి కామెంట్రీలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఇది అవుటే అనిపిస్తోంది. ఒకవేళ నిర్ణయం తనకు అనుకూలంగా లేకుంటే అతడు కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడు’’ అని నోరుపారేసుకున్నాడు. అయితే, అప్పటికి తన మైకు ఆన్‌లో ఉందని రమీజ్ రాజాకు తెలియకపోవడం గమనార్హం.
ఇక తాజాగా మరోసారి రమీజ్ రాజా తమ జట్టు ఆటగాడిని టార్గెట్ చేశాడు. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకే ఆలౌట్ చేయడంలో పాక్ స్పిన్నర్ నొమన్ అలీది కీలక పాత్ర. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
అచ్చంగా వెల్డింగ్ గ్లాస్‌లా ఉన్నాయి
అయితే, ఈ మ్యాచ్‌లో నొమన్ అలీ సన్‌గ్లాసెస్ ధరించి బౌలింగ్ చేశాడు. ఈ విషయం గురించి కామెంట్ చేస్తూ.. ‘‘ఫ్యాన్సీ గ్లాసెస్ ధరించాడు నొమన్ అలీ. ఇవైతే అచ్చంగా వెల్డింగ్ గ్లాస్‌లా ఉన్నాయి’’ అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజాపై నెటిజన్లు మండిపడుతున్నారు.
‘‘పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా సేవలు అందించిన నీ దృష్టిలో ఆటగాళ్లంటే ఇంత చిన్నచూపా. నీ కెరీర్‌లో అంత గొప్పగా ఏం సాధించావని ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 18 ఓవర్లు ముగిసేసరికి పాక్.. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.