భారీ స్కోర్ల మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరాజయం
అదరగొట్టిన ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్
అభిషేక్ శర్మ మెరుపులు వృథా
న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయం మూట గట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆశించిన స్కోరు చేయలేకపోయిన రైజర్స్... పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టగా... ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), క్లాసెన్ (33 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు.
పవర్‌ప్లేలో 105 పరుగులు
రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఈ మ్యాచ్‌లో 300 పరుగుల రికార్డు స్కోరు ఖాయనిపించింది. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్.. అర్ష్ దీప్ వేసిన మూడో ఓవర్‌లో 4, 4, 6, 6తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. యాన్సెన్ వేసిన తదుపరి ఓవర్‌లో హెడ్ 4, 6, 4 కొట్టగా... వైశాక్ వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్ నాలుగు సిక్స్‌లతో విజృంభించాడు. ఈ క్రమంలో అభిషేక్ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
తదుపరి ఓవర్‌లో హెడ్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదగా... అభిషేక్ ఓ సిక్స్ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ కోల్పోకుండా 105 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడితప్పింది. శశాంక్ ఒకే ఓవర్‌లో హెడ్, అభిషేక్‌లను పెవిలియన్‌కు చేర్చగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడినా... మరో ఎండ్‌లో క్లాసెన్ ధాటి కనబర్చలేకపోయాడు. అనికేత్ (18) అనూహ్యంగా రనౌట్ కాగా... నితీశ్ రెడ్డికి (0 నాటౌట్)ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్‌ప్లే తర్వాత 14 ఓవర్లలో హైదరాబాద్ 114 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది.
ధనాధన్ ఆరంభం
సన్‌రైజర్స్ ఓపెనర్లను మరిపించే స్థాయిలో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. ఆర్య తొలి ఓవర్‌లో 4, 6, 4 కొట్టగా... తర్వాతి రెండు ఓవర్‌లలో ప్రభ్‌సిమ్రన్ రెండేసి ఫోర్లు, రెండేసి సిక్స్‌లు బాదాడు. ఈ జంట ఏ బౌలర్‌ను వదలకుండా విరుచుకుపడటంతో... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేసింది.
ఈ క్రమంలో హర్షల్ పటేల్ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 4 కొట్టిన ఆర్య 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి ప్రభ్‌సిమ్రన్ 24 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత శ్రేయస్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగిన అయ్యర్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ కొట్టడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) అర్ష్ దీప్ (బి) శశాంక్ 74; హెడ్ (సి) బార్ట్‌లెట్ (బి) శశాంక్ 38; ఇషాన్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 27; క్లాసెన్ (సి) కూపర్ (బి) బార్ట్‌లెట్ 39; అనికేత్ (రనౌట్) 18; సలీల్ (సి) బార్ట్‌లెట్ (బి) అర్ష్ దీప్ 9; నితీశ్ రెడ్డి (నాటౌట్) 0; హర్ష్ దూబే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219.
వికెట్ల పతనం: 1–120, 2–122, 3–169, 4–195, 5–214, 6–218.
బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–50–2; బార్ట్‌లెట్ 4–0–42–1; యాన్సెన్ 4–0–40–0; వైశాక్ 2–0–33–0; శశాంక్ 3–0–20–2; చాహల్ 3–0–33–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ఆర్య (సి) నితీశ్ రెడ్డి (బి) శివాంగ్ 57; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) శివాంగ్ 51; కూపర్ (సి) అభిషేక్ (బి) శివాంగ్ 11; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 69; నేహల్ వధేరా (బి) హర్ష్ 14; శశాంక్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4
వికెట్లకు) 223.
వికెట్ల పతనం: 1–99, 2–117, 3–128, 4–197.
బౌలింగ్: హర్ష్ దూబే 4–0– 38–1; జైదేవ్ ఉనాద్కట్ 3–0–40–0; ఇషాన్ మలింగ 3–0–46–0; హర్షల్ 2–0–39–0; శివాంగ్ కుమార్ 4–0–33–3; నితీశ్ రెడ్డి 2–0–20–0; అభిషేక్ 0.5–0–7–0.


