ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.
మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్‌లెట్ ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సన్‌రైజర్స్‌కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్ ఓపెనర్లు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఆతర్వాత శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (4-0-33-3) రాణించాడు.


